
ఠంచన్‌గా బడికి..
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 1 నుంచి ప్రారంభించిన ఉపాధ్యాయల ఆన్‌లైన్ హాజరు సత్ఫలితాలనిస్తోంది. డీఆర్‌సీ–ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ అటెన్‌డెన్స్) యాప్ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగింది. ఉపాధ్యాయులు సమయానికి వస్తుండడంతో వి ద్యార్థులకు అభ్యసన ప్రయోజనం కలుగుతోంది. అయితే విద్యార్థులకు అమలు చేస్తున్న ముఖ హా జరు అంతంత మాత్రంగానే ఉంది. ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం, యూడైస్ మాడ్యుల్‌లోని వి ద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోకి తీసుకరావడానికి ప్రయత్నం చేసినా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోకపోవడం, యాప్‌లో కొన్ని లోపాల కారణంగా విద్యార్థుల హా జరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది.
ఆగడాలకు చెక్
ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలులోకి రాక ముందు చాలా మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయానికి వచ్చేవారు కాదు. అలాగే కొందరు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నాయకులు డుమ్మాలు కొట్టడం, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతర ఫైనాన్స్ లు నడిపిస్తూ పాఠశాల ముఖం అప్పుడప్పుడు చూసేవారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులోకి వచ్చిన తరువాత ఈ నెల 4వ తేదీన 94.7 శాతం మంది ఉపాధ్యాయులు సమయానికి బడికి వెళ్లారు. ఈ విద్యా సంవత్సరం బడిబాట విజయవంతం కావడంతో గతేడాదితో పోలిస్తే అధికంగా దాదాపుగా 3వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
ఈ పాఠశాలల్లో తక్కువ..
ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ జిల్లాకు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో సాలూర మండలంలో పెంటాకుర్దు కాంప్లెక్స్ పాఠశాల, ఆర్మూర్ మండలంలోని ఆర్మూర్, పెర్కిట్ పాఠశాల సముదాయాలు, మెండోరా మండలంలో పోచంపాడ్ కాంప్లెక్స్, మోపాల్ మండలంలోలు బోర్గాం (పి) పాఠశాల సముదాయం విద్యార్థుల ముఖహాజరులో చాలా వెనుకబడి ఉన్నాయి. ఆయా కాంప్లెక్స్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం కూడా దాటలేదు. అలాగే జిల్లాలో ధర్పల్లి మండలం లోని హోన్నాజిపేట్ కాంప్లెక్స్ పాఠశాల 90శాతం విద్యార్థుల ముఖహాజరు నమోదుతో ప్రథమస్థానంలో ఉంది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో ప్రైవేట్ యాజమాన్యాలు బదిలీ చేయకపోవడం కూడా హాజరు శాతం తక్కువ నమోదుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,162
ఉపాధ్యాయులు 6,466,
విద్యార్థులు 1,01,144
విద్యార్థుల హాజరు తగ్గడానికి కారణాలెన్నో..
ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ హాజరు) అమలుతో ఓ వైపు ఉపాధ్యాయుల హాజరు పెరిగినప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రతిరోజూ వివిధ కారణాలతో 10 నుంచి 20 శాతం మంది విద్యార్థులు బడికి రావడం లేదు. అలాగే వచ్చిన విద్యార్థులకు సంబంధించి ముఖ హాజరు నమోదులో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌లో లోపాల కారణం ముఖహాజరు రావడం లేదు. అలాగే ముఖ హాజరుకే ఎక్కవ సమయం నెట్ డాటా వృథాకావడంతో ఉపాధ్యాయుల దీనిపై తగిన ఆసక్తి చూపడం లేదు. కొన్ని మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉంటోంది.
సమయానికి బడులకు
చేరుకుంటున్న ఉపాధ్యాయులు
పెరిగిన ఉపాధ్యాయుల హాజరుశాతం
సత్ఫలితాలనిస్తోన్న ఫేస్ రికగ్నిషన్
బేస్డ్ అటెన్‌డెన్స్