● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● మున్సిపల్ అధికారులతో సమీక్ష
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పాలనపై కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించారు. బల్దియా పాలన అస్తవ్యస్తంగా మారడంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ తాజాగా గురువారం టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్, బిల్డింగ్ పర్మిషన్, ఆక్రమణల తొలగింపు, పెండింగ్ ఫైళ్లపై ఆరా తీశారు. పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డిని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు తీసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డిలతోపాటు టీపీవో ప్రదీప్‌కుమార్, టీపీఎస్‌లు, టీపీబీవోలు పాల్గొన్నారు.
నేడు జిల్లాకు
మంత్రి వాకిటి శ్రీహరి
● ఐదు నియోజకవర్గాల్లో
విస్తృత స్థాయి సమావేశాలు
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్మూర్, 2.30కు బాల్కొండ, 3.45కు బోధన్, సాయంత్రం 5.30 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు హాజరవుతారు. మంత్రితోపాటు బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వినయ్‌రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొంటారని మానాల పేర్కొన్నారు.
‘సాగర్’ నుంచి 6వేల క్యూసెక్కుల నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు