
ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని వైస్ చాన్స్‌లర్ టి.యాదగిరిరావు తెలిపారు. బుధవారం తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి అధ్యక్షతన నిర్వహించిన నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరిచయ కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు 18 ఏళ్ల సుధీర్ఘ కల అని, ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం అనుమతించారన్నారు. విద్యార్థులకు అధునాతన సాంకేతిక బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కౌన్సిలింగ్ సమయంలో హాస్టల్ వసతి లేదని ప్రకటించామని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల వినతి మేరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ముఖ్యం కాదని, ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత ఏం నేర్చుకున్నాం.. ఎలా జీవితంలో స్థిరపడ్డారనేదే ముఖ్యమని అన్నారు. ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులైన మీరు తర్వాత వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సహకరించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంబిక, నీలిమ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.