
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 42వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. క్రితం రోజు సోమవారం సాయంత్రం పెరిగిన వరద మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి 8 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీరు పోతుంది. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్ట్ ద్వారా 270 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది.