
బైక్‌ను ఢీకొన్న కారు: ఒకరికి గాయాలు
ఖలీల్‌వాడి: నగరంలోని గాజులపేట్‌లోగల ఏఆర్ జిరాక్స్ వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేట్‌కు చెందిన ప్రేమ్‌కుమార్(45) మంగళవారం బైక్‌పై కంఠేశ్వర్‌కు బయలుదేరాడు. గాజులపేట్‌లోని ఏఆర్ జిరాక్స్ వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా, బైక్‌పై వెళుతున్న ప్రేమ్‌కుమార్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జక్రాన్‌పల్లి మండలంలో ఇద్దరికి..
జక్రాన్‌పల్లి: మండల పరిధిలో బైక్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ఆర్గుల్ గ్రామానికి చెందిన జైడి నర్సయ్య, అతని కోడలుతో కలిసి బైక్‌పై మంగళవారం ఆర్మూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జక్రాన్‌పల్లి ఎస్‌హెచ్‌వో తెలిపారు.
● కాపాడిన పోలీసులు
ఆర్మూర్‌టౌన్: ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళలను పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. పెర్కిట్ గ్రామానికి చెందిన సిరిగాల లక్ష్మీ ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందింది. దీంతో సోమవారం రాత్రి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళను చెరువులో దూకకుండా అడ్డుకొని కాపాడి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిండు ప్రాణాలు కాపాడిన ఆర్మూర్ ఎస్బీ కానిస్టెబుల్ విజయ్‌కుమార్, ఏఎస్సై రాందాస్‌ను స్థానికులు అభినందించారు.
డిచ్‌పల్లి: మండలంలోని బీబీపూర్ తండా సమీపంలోగల 44వ నంబరు జాతీయ రహదారిపై కంకర లోడ్‌తో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కంకర లోడ్‌తో టిప్పర్ మంగళవారం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ బయలుదేరింది. బీబీపూర్ తండా సమీపంలో టిప్పర్ అతివేగంతో అదుపుతప్పి సైడ్‌వాల్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కాగా, టిప్పర్ ముందుభాగం దెబ్బతింది. స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
నందిపేట్ (ఆర్మూర్): మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్ ఢీకొని కారు బోల్తా పడగా, అందులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి నందిపేట్ వైపు వస్తున్న కారు మంగళవారం ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పల్టీలు కొడుతూ కొద్ది దూరం వెళ్లి బోల్తా పడింది. వెంటనే స్థానికులు కారు వద్దకు వెళ్లి అందులోని ముగ్గురు ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన వారీగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బైక్‌ను ఢీకొన్న కారు: ఒకరికి గాయాలు