
ఫోన్ హ్యాక్.. ఖాతా షేక్..
హ్యాకర్లకు చిక్కకుండా..
అప్రమత్తంగా ఉండాలి
మోర్తాడ్ (బాల్కొండ) : మనోడే కదా వాట్సాప్‌లో ఏపీకే ఫైల్ పంపింది.. ఓపెన్ చేద్దామని క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. క్షణాల్లోనే సైబర్‌నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసేస్తారు. ఎంచక్కా మొబైల్‌లోని పాస్‌వర్డులు, ఓపీటీలను తెలుసుకొని మీ ఖాతాల్లోని డబ్బులను దోచేస్తుంటారు. ఇలా ఒకరి తర్వాత మరొకరి మొబైల్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ ఏపీకే ఫైల్ పంపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
మోసం జరుగుతోంది ఇలాగే..
● సైబర్ మోసగాళ్లు వాట్సాప్‌కు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులు, ఆఫర్ల పేరిట ఓ ఏపీకే ఫైల్‌ను పంపిస్తారు.
● ఆ ఫైల్‌ను క్లిక్ చేయగానే మన మొబైల్ హ్యాక్ అవుతుంది. అనంతరం మన ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను వాడేస్తుంటారు. గుట్టుగా మన సమాచారాన్ని దొంగిలిస్తారు. ఆ తర్వాత బ్యాంకు పిన్, పాస్‌వర్డుల సహాయంతో మన ఖాతాను ఖాళీ చేస్తారు.
● హ్యాక్ చేసిన మొబైల్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తూ ఇలాగే మోసం చేస్తుంటారు.
భద్రమైన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
పాస్‌వర్డులు, పిన్ నంబర్లు, క్రెడిట్ కార్డులు ఇతరత్రా కీలక సమాచారాన్ని మొబైల్‌లో సేవ్ చేసుకోవద్దు.
ఫోన్లకు ఇతరులు ఊహించలేని, కఠినతరమైన పాస్‌వర్డులు పెట్టుకోవాలి.
ప్రధానంగా ఏపీకే ఫైల్స్, లింక్‌లను అసలే క్లిక్ చేయొద్దు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. ఓటీపీ నంబర్‌లు ఎవరికీ చెప్పొద్దు.
– పొన్నం సత్యనారాయణ, సీఐ, భీమ్‌గల్
రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు
ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను
హ్యాక్ చేస్తున్న కేటుగాళ్లు
పాస్‌వర్డులు, ఓటీపీలతో ఖాతాల్లోని
డబ్బులను దోచుకుంటున్న వైనం