
బోధనలో ప్రత్యేకం మా‘స్టారు’
● విద్యతోపాటు నైతిక విలువలకు పెద్దపీట
నిజామాబాద్‌అర్బన్: బోధనలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలూ ముఖ్యమని భావిస్తాడు. 29 ఏళ్లుగా ఈయన బోధనలో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఆ విధానంతోనే భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన నంబి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1997లో ఆగస్టు 28న టీచర్ ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం వేల్పూర్ మండలం మోతె మండల పరిషత్ పాఠశాలలో ఎస్టీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక విధానాలు, క్రమశిక్షణ అలవర్చారు. సమాజంలో మారుతున్న విధానాలపై విద్యార్థులకు బోధిస్తారు. వారంలో ఒకరోజు క్వీజ్ పోటీలను నిర్వహిస్తూ సొంత డబ్బులతో వారికి బహుమతులు ప్రదానం చేసేవారు. విద్యార్థులతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ‘పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలు ఎంతో ముఖ్యం, క్రమశిక్షణ తోడైతే బంగారు భవిష్యత్తు లభిస్తుంది’ అని చెబుతున్నారు నంబి శ్రీనివాస్. జిల్లాస్థాయి అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

బోధనలో ప్రత్యేకం మా‘స్టారు’