
విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమే
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
కమ్మర్‌పల్లి: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, ఆటలతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండలం అమీర్‌నగర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల అంతర పాఠశాలల క్రీడాపోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. ఇక్కడి విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. మార్చ్‌ఫాస్ట్‌లో మొదటిస్థానంలో చౌట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్, ద్వితీయ స్థానంలో బషీరాబాద్, కోనసముందర్, తృతీయ స్థానంలో హసకొత్తూర్ పాఠశాలలు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో మొదటిస్థానంలో విజ్ఞాన జ్యోతి, ద్వితీయ స్థానంలో క్రిష్ణవేణి, తృతీయ స్థానంలో శ్రీవిద్యాసాయి పాఠశాలలు నిలిచాయి. వీరికి ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు.
గదుల నిర్మాణానికి కృషి..
అమీర్‌నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉందని, గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి, రేగుంట దేవేందర్, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, ఎంఈవో ఆంధ్రయ్య, డీఎస్‌డీవో పవన్, నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు.