
పంటలను గట్టెక్కించారు
● యూరియా కొరత తీర్చిన సొసైటీ
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మాక్లూర్: ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత రాకుండా తీసుకున్న జాగ్రత్తలు పంటలను గట్టెక్కించాయి. జిల్లాలో పలు మండలాల్లో యూరియా కొరత ఏర్పడినప్పటికీ మాక్లూర్‌లో మాత్రం రైతులు ఆ సమస్య ఎదుర్కోకుండా సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్ సఫలీకృతులయ్యారు. మాక్లూర్ మండలంలో మొత్తం 19,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా, సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. దీంతో నిత్యం ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రైతాంగానికి కావాల్సిన యూరియాను తెప్పించారు. గ్రామాలకు వెళ్లి యూరియా అవసరం ఉన్నంత వరకే కొనుగోలు చేసుకోవాలని ఆ తర్వాత మళ్లీ అవసరానికి యూరియా అందించే బాధ్యత తనదని రైతులకు హామీ ఇచ్చారు. ఆ దిశగా విడుతల వారీగా పంటకు కావాల్సిన యూరియాను అందించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వరి పొట్టదశలో ఉండగా, మరికొన్ని చోట్ల కంకి పూర్తిగా బయటికి వచ్చింది. కాగా, గతంలో సొసైటీకి వచ్చిన యూరియా పక్కదారి పట్టేదని, సమయానికి ఎరువులు వేయక దిగుబడి తగ్గి నష్టపోయామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సరిపడా యూరియా అందించి పంటలను గట్టెక్కించడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.