
అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణ
● రూ. రెండు కోట్లతో పనులు
● పాత భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణం.. తాగునీటి సదుపాయం
● 10 నూతన భవనాల నిర్మాణం
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు మరుగుదొడ్ల సదుపాయం లేకపోగా, తాగునీటి సరఫరా అంతంతే. అరకొర సదుపాయాల మధ్య అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతుండడంతో ప్రభు త్వం కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించింది. రూ.2 కోట్ల నిధులతో జిల్లాలోని సెంటర్లను ఆధునికీకరించడంతోపాటు 10 నూతన భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. జిల్లాలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మొత్తం ఐదు సీడీపీవో(చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) కార్యాలయాలు ఉండగా, వీటి పరిధిలో 1501 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా, మిగతా చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే 400 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 216 కేంద్రాల్లో తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు 10 నూతన భవన నిర్మాణ పనులను ప్రా రంభించారు. ఇప్పటికే 156 మరుగుదొడ్ల నిర్మాణ పూర్తయ్యాయని, 244 చోట్ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొంటున్నారు. సెంటర్ల ఆధునీకరణలో భాగంగా భవనాలకు రంగులు వేయించడంతోపాటు గోడలపై పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాలు గీయించారు.
216 సెంటర్లలో తాగునీటి సదుపాయం కల్పించేందుకు పనులు చేపట్టగా 35 సెంటర్లలో పనులు పూర్తయ్యాయి. మొత్తం 10 చోట్ల నూతన భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటికే ఐదు చోట్ల పనులు పూర్తయ్యాయి.
రూపురేఖలు మారుతున్నాయి
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి. మరమ్మతులతో పాటు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్న చోట్ల మరుగుదొడ్ల నిర్మాణ పనులు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే కొత్త భవనాలు సైతం నిర్మిస్తున్నాం.
– రసూల్‌బీ, జిల్లా సంక్షేమాధికారిణి