
క్రైం కార్నర్
శోభాయాత్రలో విద్యుత్‌షాక్‌తో ఒకరికి గాయాలు
మాచారెడ్డి: మండలంలోని సోమారంపేటకు చెందిన ఓ యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గూగులోతు రవి (32) మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. తన గదిలో ఆదివారం అతడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది. ప్రభుత్వం స్పందించి రవి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని గ్రామస్తులు కోరారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్‌కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారయ్యారని ఎస్సై మురళి తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు పేకాడుతుండగా పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.2850 నగదు, మూడు బైక్‌లు, మూడు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
బాన్సువాడ: పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే పురుషోత్తం అనే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్‌కు పురుషోత్తంకు మధ్య శనివారం గొడవ జరిగింది. తారాచంద్ తలపై పురుషోత్తం వాటర్ బాటిల్‌తో కొట్టగా ఆయనకు తీవ్ర గాయమైంది. దీంతో తారాచంద్ బాన్సువాడ పోలీస్టేషన్‌లో పురుషోత్తంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే తారాచంద్ తనను ఇష్టం వచ్చినట్లు దూషించడని పురుషోత్తం కూడా ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో ఆదివారం నిర్వహించిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో గాయపడ్డాడు. రాంనగర్ మండప నిర్వహకులు వినాయకుడిని నిమజ్జనానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. హుస్సాబాద్‌కాలనీకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ వైర్లు వినాయకుడికి తగిలాయి. దీంతో వినాయకుడి పక్కనే పడుకొని ఉన్న నితిన్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగలంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.