
లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించాలి
వేల్పూర్: మండలంలోని కుకునూర్, నవాబు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వేల్పూర్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను కుకునూర్ గ్రామస్తులు, నవాబు లిఫ్ట్ కమిటీ సభ్యులు ఆదివారం కలిసి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించాలని విన్నవించారు. దీంతో ఆయన నీటి పారుదల శాఖ సీఈ మధుసూదన్, ఈఈ భానుప్రకాశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సీజన్ ప్రారంభించకముందే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉన్నది, లేనిది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను తెప్పించి నవాబు లిఫ్ట్‌ను ప్రారంభించాలన్నారు. కుకునూర్ లిఫ్ట్ మోటార్లు ఇసుకలో కూరుకుపోయినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేగా, సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్‌లో 45 టీఎంసీల నీరున్నప్పుడే లిఫ్ట్‌ల ద్వారా చెరువులు నింపి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదన్నారు. వందల టిఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయిలో నీరున్నందున వెంటనే గుత్ప, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్‌లు ప్రారంభించి చెరువులు నింపాలని అన్నారు. నిర్వహణ లేక వేంగంటి లిఫ్ట్‌కు సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర సామగ్రిని దుండగులు ఎత్తుకుపోయారని, వాటికి మరమ్మతులు చేసి పల్లికొండ లిఫ్ట్‌ను కూడా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.