
ఆర్మూర్ గణేశ్ శోభాయాత్రలో ఉద్రిక్తత
● లాఠీచార్జ్ చేసిన పోలీసులు
● రోడ్డుపై బైఠాయించి, నిరసన
తెలిపిన యువకులు
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గణేశ్ మండలి యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు రెండు గంటలపాటు శోభాయాత్ర నిలిచిపోయింది. వివరాలు ఇలా.. పట్టణంలోని కంఠేశ్వర యూత్ గణేష్ మండలి వద్ద ఓ పోలీసు అధికారి దురుసుగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడంతో మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు యూత్ సభ్యులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో మండపాల నిర్వాహకులు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు గణేష్ శోభాయత్ర సైతం నిలిచిపోవడంతో పాటు వివిధ మండపాల నిర్వాహకులు కంఠేశ్వర్ యూత్ సభ్యులకు మద్దతు తెలిపారు. అనంతరం యూత్ సభ్యులను పలువురు సముదాయించి శోభాయాత్రను కొనసాగే విధంగా చేశారు.