
అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక!
డొంకేశ్వర్(ఆర్మూర్) : మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ‘రేవంతన్న’ కానుక పేరుతో ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాలో సంఘాలు.. వాటిలో సభ్యుల సంఖ్య ఎంత? ఏయే ప్రాంతాలకు సరఫరా చేయాలనే వివరాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఈ చీరలను చేనేత, జౌళి శాఖ తయారు చేయిస్తుండగా, పలు జిల్లాలకు సరఫరా కూడా ప్రారంభమైంది. జిల్లాకు ఈ వారంలోనే చీరలు రానుండగా, వాటిని భద్రపరిచేందుకు నిజామాబాద్, బోధన్, మోర్తాడ్, పెర్కిట్, డిచ్‌పల్లిలో గోదాములను గుర్తించారు. ఆయా గోదాముల నుంచి మండలాలకు రవాణా చేసి గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వనుంది. ప్రతి సభ్యురాలికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ప్రస్తుతం ఒకటి ఇచ్చి మరోటి తర్వాత ఇవ్వనున్నారు. అయితే.. ఈ చీర ఒకే రంగులో, ఒకే డిజైన్‌లో ఉండనుంది. ఎస్‌హెచ్‌జీ మహిళలు సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లినప్పుడు దీనినే యూనిఫాంగా వినియోగించాల్సి ఉంటుంది.
మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి వివరాలను సేకరించింది. జిల్లాలో ఎక్కడెక్కడికి సరఫరా చేయాలో గోదాముల వివరాలను పంపించాం. ఈ వారంలోనే జిల్లాకు చీరలు రానుండగా, ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం మహిళలకు అందజేస్తాం.
– సాయాగౌడ్, డీఆర్డీవో,నిజామాబాద్
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఉచితంగా ‘యూనిఫాం’ చీరలు
త్వరలో పంపిణీ చేయనున్న
రాష్ట్ర ప్రభుత్వం
ఈ వారంలోనే జిల్లాకు సరఫరా..

అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక!