
వరలక్ష్మి.. వరప్రదాయినీ
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతను మహిళలు ప్రత్యేకంగా కొలుస్తుంటారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వత్రాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజున వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, వ్రతం ఆచరించేవారు ఉపవాస దీక్ష పాటించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మహిళలు నేడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు మహిళలు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని, ముగ్గులు తోరణాలు పెట్టి శోభాయమానంగా అలంకరిస్తారు. ధనధాన్య, విద్యా, వైద్య, సంతాన, అష్టలక్ష్మిలను పూజించిన ఫలితము ఈ ఒక్క వరలక్ష్మి ప్రతం నాడు అమ్మవారిని పూజించడంతో దక్కుతుందని పండితులు పేర్కొంటున్నారు.
పూజా విధానం..
ఇత్తడి, రాగి, వెండి, బంగారు చెంబులో కొబ్బరికాయతో కలశ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. కొందరు మహిళలు అమ్మవారిని ప్రార్థించి పాలు తేనె నెయ్యి వంటి వాటితో అభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారికి చీరలు, రవికలు పండ్లు బెల్లం నెయ్యితో తయారుచేసిన నైవేద్యాలతో సమర్పించి యధాశక్తిగా పూజిస్తారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మహిళలయితే బిందెలకు చీరలను కట్టి పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా అమ్మవారిని పూజిస్తారు. వ్రతం చేసేటప్పుడు గోత్రనామాలతో సంకల్పం చేసుకుంటారు. అలాగే కలశ పూజ, గణపతి, గౌరీ పూజలను సైతం నిర్వహి స్తారు. లక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించి, అమ్మవారి నామాలతో, తామర పువ్వులతో పుష్పార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించడం శ్రేష్ఠమని పండితులు విశ్లేషిస్తున్నారు. వ్రతం అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం వల్ల పదికాలాలపాటు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం.
ఆలయాలు ముస్తాబు..
నగరంలోని దేవిరోడ్‌లోగల దేవీమాతా ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, లలితాదేవి ఆశ్రమాలయం, దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.
నేడు వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు
వచ్చే శుక్రవారం రోజున నిర్వహణ