
డీసీసీబీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
● ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి
సుభాష్‌నగర్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఇటీవల నిర్మించిన రెండో అంతస్తును రమేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు నిధులు సుమారు రూ.కోటీ 40లక్షల వ్యయంతో సకల వసతులతో కూడిన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. బ్యాంకులో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగులు, సిబ్బంది మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. గడిచిన ఏడాది కాలంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పని తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ స్టేట్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎన్‌డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు, సీఈవో నాగభూషణం వందే, డీసీవో శ్రీనివాస్‌రావు, టీజీసీఏబీ జనరల్ మేనేజర్ సురేశ్, జీఎం లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.