
బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
మాక్లూర్: బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గంగరమందలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగరమంద గ్రామానికి చెందిన ధాత్రిక అభినయ్(20) చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. తల్లి జమున అభినయ్‌ను తన తల్లి చంద్ర వద్ద వదిలేసి మరో వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అమ్మమ్మే అన్నీ తానై అభినయ్‌ను పెంచింది. ఇంటర్ పూర్తి చేసిన అభినయ్.. ఆ తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్లేవాడు. ఇటీవల బైక్ కొనివ్వాలని అమ్మమ్మను కోరాడు. పేదరికంలో ఉన్నామని, అంత డబ్బు మనవద్దలేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన అభినయ్ మంగళవారం సాయంత్రం నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో అమ్మమ్మ ఆందోళనకు గురై వెతుకుతుండగా అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో గ్రామశివారులోని హన్మాన్ మందిరం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నట్లు గుర్తించారు. అమ్మమ్మ చంద్ర ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.