
పోగొట్టుకున్న డబ్బులు అందజేత
నందిపేట్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 20 వేలు పోగొట్టుకున్న వృద్ధురాలికి పోలీసుల సమక్షంలో ఆ నగదును అందించిన ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన షాపురం సాయమ్మ డొంకేశ్వర్ మండలం దత్తపూర్‌లో ఉండే తన కుమార్తె వద్దకు వెళ్లి వ్యక్తిగత పనుల కోసం ఆమె నుంచి రూ. 20 వేలు డబ్బులు తీసుకొని సోమవారం మధ్యాహ్నం బయలు దేరింది. నందిపేట్ బస్టాండ్‌లో బస్సు దిగుతున్న సమయంలో సంచిలో నుంచి డబ్బులు పడిపోయాయి. ఇది గమనించని ఆమె నడుచుకుంటూ వెళ్లి లక్కంపల్లి బస్సు కోసం బస్టాండ్‌లో కూర్చుంది. కాగా అదే సమయంలో బస్టాండ్‌లోకి వచ్చిన మాయపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్నక్కకు ఆ డబ్బులు దొరికాయి. ఈ విషయాన్ని అక్కడే ఉండి గమనిస్తున్న మరో మహిళ డబ్బులు నావి అంటు గుంజుకునే ప్రయత్నం చేసింది. వెంటనే గొల్ల చిన్నక్క ఆ డబ్బులను ఆర్టీసీ కంట్రోలర్ హనుమ దాస్‌కు ఇచ్చింది. దీంతో కంట్రోలర్ డబ్బులు దొరికిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు అక్కడున్న ప్రయాణికులతో విచారించారు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు పోసాని ఆ డబ్బులు తనవే అంటూ పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆమె కుమార్తెకు సమాచారం ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులు వృద్ధురాలికి ఆ నగదును అందజేశారు.