
రైతు వేదికలకు నిలిచిన నిధులు
ధర్పల్లి: రైతులు నిరంతరంగా సమావేశాలు నిర్వహించుకొని పంటల సాగు, వ్యవసాయంలో కొత్త విధానాలు, అధికారుల సూచనలు తెలుసుకునేందుకు వీలుగా రైతు వేదికలను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా వీటిని నిర్మించింది. వ్యవసాయశాఖతోపాటు అనుబంధ విభాగాలు, ఇతర శాఖలకు సంబంధించి అవసరమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామానికి దూరంగా, కొన్ని దగ్గరగా నిర్మించారు. కార్యాలయాలు ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణకు నిధులు కేటాయించడంలేదు. ప్రతివారం రైతు నేస్తం కార్యక్రమాల నిర్వహణతో పాటుతో పంటల సాగులో మెలకువలు కోసం ఏర్పాటు చేసే అవగాహన సదస్సులు, పలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు, రైతులకు చేరవేసేందుకు నిర్వహించే భారం అంతా వ్యవసాయ శాఖ అధికారులపైనే పడుతోంది.
ఏఈవోలకు కష్టాలు
ధర్పల్లి మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా రామడుగు, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేట్ పంచాయతీల్లో రైతు వేదికలను గత ప్రభుత్వంలో సంబంధిత అధికారులు నిర్మించారు. ప్రస్తుతం రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈవోలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు సొంత డబ్బులు నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు.
శిక్షణ కార్యక్రమాలు–సమావేశాలు
వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు. ప్రత్యేకంగా ఫర్నిచర్ కూడా సమకూర్చారు. శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన కుర్చీలు, మైకు వంటివి ఏర్పాటు చేశారు. సీజన్ల వారీగా పంటల సాగుపై అవసరమైన వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ, రైతు సమావేశాలు నిర్వహించారు. వీటిని ఇతర శాఖలు కూడా వినియోగించుకుంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాల్లో మినీ వేడుక మందిరంగా కూడా ఉపయోగపడుతుంది.
భారంగా నిర్వహణ
రైతు వేదిక నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు రూ.9 వేలు విడుదల చేసేది. గత కొంతకాలంగా నిధులు ఆగిపోవడంతో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది. రైతు వేదికల విద్యుత్ బిల్లులు రూ. వేలల్లో పేరుకు పోతున్నాయి. స్వీపర్, తాగునీటి ఖర్చు తదితర ఖర్చులను కొన్నిచోట్ల ఏఈవోలే భరిస్తున్నారు.
దుబ్బాకలోని రైతు వేదిక
వ్యవసాయ అధికారులపైనే
నిర్వహణ భారం
పేరుకు పోయిన బకాయిలు