
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బీర్ల సిద్ధయ్య(44) కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్లగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
పేకాట స్థావరంపై దాడి
ఎల్లారెడ్డి: మండలంలోని రుద్రారం గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రుద్రారం శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.4500 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
మోపాల్: మండలంలోని కాస్‌బాగ్ తండాకు చెందిన బాదావత్ పీర్‌సింగ్ అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.