
ఒకటికి ఓర్చుకోవాల్సిందే..
ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. పలు బడుల్లో మరుగు దొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణం జిరాయత్‌నగర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (చిప్ప స్కూల్)లో విద్యార్థులు ఒకటికి వెళ్లాలంటే శిథిలమైన టాయిలెట్ల గోడ వెనకకు, రెండుకు వెళ్లాలంటే మాత్రం ఇంటికి పరుగెత్తాల్సిందే. మన ఊరు–మన బడిలో నిధులు మంజూరైనప్పటికీ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో తెలుగు, ఉర్దూ మీడియం కలిపి 120 మంది విద్యార్థులుండగా అందులో బాలికలే 80 మంది ఉన్నారు. బాలికలు గోడ వెనకకు వెళ్లలేక ఇంటికి వెళ్లే వరకు ఓర్చుకుంటూ దయనీయంగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో నలుగురు మహిళా ఉపాధ్యాయులకు మాత్రం ఒక టాయిలెట్ అందుబాటులో ఉంది. ఆలూరు మండలం గగ్గుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో వెనక్కి వెళ్లాయి. మూత్రశాలలకు నీటి సరఫరా సౌకర్యం లేకపోవడంతో స్కావెంజర్ దూరం నుచి నీటిని మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
నలుగురు విద్యార్థులతో మాందాపూర్ బడి
మాక్లూర్ మండలం మాందాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 8 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో ఒక ఉపాధ్యాయుడిని గొట్టుముక్కులకు డిప్యుటేషన్‌పై పంపించారు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతిలో ఆరుగురు, మూడులో ఎనిమిది, నాలుగులో ముగ్గురు, ఐదో తరగతిలో పది మంది చదువుతున్నారు.
కాలకృత్యాలకు ఇంటికి
పరుగెత్తాల్సిన దుస్థితి
వసతుల్లేక తగ్గుతున్న విద్యార్థులు
ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ బడులు
ఆర్మూర్ నియోజకవర్గంలో టాయిలెట్లు
లేక ఇక్కట్లు పడుతున్న విద్యార్థులు
ఇంటికి వెళ్తున్నాం..
ఒకటికి అయితే గోడ వెనకకే వెళ్తున్నాం. రెండుకు అయితే మాత్రం టీచర్‌ను అడిగి ఇంటికి వెళ్లి వస్తున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి.
– పూజ, విద్యార్థిని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిరాయత్‌నగర్, ఆర్మూర్

ఒకటికి ఓర్చుకోవాల్సిందే..

ఒకటికి ఓర్చుకోవాల్సిందే..