
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయం రంగంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైతే రైతులకు లాభాలకంటే నష్టాలే మిగులుతాయి. అలాగే ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు అనేక సవాళ్లను ఎదుర్కోటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యానవన పంటలను ప్రోత్సాహిస్తున్నాయి. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అనేక రాయితీలు ప్రకటిస్తున్నాయి.
పండ్లు, కూరగాయలకు..
ఉద్యానవన పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందజేస్తోంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేడెట్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్) పథకం ద్వారా రాయితీ అందజేస్తున్నారు.
పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటలు, కూరగాయలు, పూలు తదితర పంటలకు, పరికరాలపై రాయితీ ఇస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఎకరానికి రూ.64,800, బొప్పాయి, సీతాఫలం పంటలకు రూ.7,200, మామిడి, జామ, నిమ్మ తోటలకు రూ.19,200, పూల సాగు, ఉల్లి, ప్లాస్టిక్ మాల్చింగ్‌కు ఎకరానికి రూ.8 వేల చొప్పున అందజేస్తున్నారు.
రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తోంది. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ సబ్సిడీ ఇస్తోంది. ఆసక్తి గల రైతులు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లతో ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి రాయితీ పొందవచ్చు.– రాజు, ఉద్యానవన శాఖ అధికారి, ఆర్మూర్

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం