
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి
ఆర్మూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీని బుధవారం ఆయన సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, ప్లాట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయన్నారు. అధికారులు, వార్డు ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. అలసత్వ వైఖరిని వీడాలని, ఇకనైనా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. వన మహోత్సవం విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్లాట్ల క్రమబద్ధీకరణ అనుమతి మంజూరు చేయాలన్నారు.
పనులు ప్రారంభించాలి
పట్టణంలోని 11, 12 వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఆయన వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో
అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి