
ప్రభుత్వ టీచర్లు అంకితభావంతో పనిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సన్మానించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాద్, చౌట్‌పల్లి, జక్రాన్‌పల్లి, మోస్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడుల్లో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గం(పి) హైస్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తుంపల్లి ప్రైమరీ స్కూల్, ఫులాంగ్ బాలుర ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలను సత్కరించారు. సోమవారం పదవీ విరమణ చేసిన ముగ్గురు ఎంఈవోలు, ముగ్గురు హెచ్‌ఎంలను సన్మానించి వీడ్కోలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.