
నీవు లేని జీవితం నాకొద్దని..
వర్ని: ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతుని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఎరుకల పోశెట్టి(25) వడ్డేపల్లిలో ఉండే తన బంధువుల ఇంట్లో చిన్న నాటి నుంచి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అనితను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని పోశెట్టి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య