ధర్పల్లి: పచ్చదనాన్ని పెంచేందుకు ఏటా వనమహోత్సవం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వానాకాలంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. గత ప్రభుత్వం తెలంగాణ హరితహారం పేరుతో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఇదే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటుతున్నారు. ఈ క్రమంలో జూలైలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
22 జీపీల్లో..
ఈ ఏడాది కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నర్సరీలు లో పెంచిన మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వర్షాలతో పాటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జూలై మొదటి వారంలో మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు సమాయత్తమవుతున్నారు. ధర్పల్లి మండలంలోని 22 జీపీల్లో మొక్కలు పెంచేందుకు 21 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీలో 8 వేల మొక్కల చొప్పున మండలంలో మొత్తం 1 లక్ష 76 వేల మొక్కలను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచారు. లక్ష్యానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఇప్పటికే అధికారులు గుర్తించి గ్రామాల్లో గుంతలు తీసే ప్రక్రియను షురూ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు.
ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, తులసి, ఉసిరి, నిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, ఆకాశమల్లి వంటి 20 రకాల మొక్కలతోపాటు ఇతర ప్రదేశాల్లో నాటేందుకు ఈత, తాటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ధర్పల్లి మండలంలో లక్షా 76 వేల మొక్కలు నాటాలని లక్ష్యం
ఒక్కో నర్సరీలో 8 వేల వరకు
మొక్కల పెంపకం
గ్రామంలో గుంతలుతీసే ప్రక్రియ షురూ
ప్రతి గ్రామానికి పంపిణీ చేస్తాం
ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాలు పడగానే జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. ప్రతి గ్రామంలో ఇచ్చిన లక్ష్యం మేరకు మొక్కలను నాటిస్తాం.
– బాలకృష్ణ, ఎంపీడీవో, ధర్పల్లి
వనమహోత్సవానికి సర్వం సిద్ధం
వనమహోత్సవానికి సర్వం సిద్ధం