
టెక్సాస్ యూనివర్సిటీలో తెయూ అధ్యాపకురాలి ప్రసంగం
తెయూ(డిచ్‌పల్లి): అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ఆస్టీన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గుల్–ఏ–రాణా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆమె ముజ్తబా హుస్సేన్‌తో సహా ఉర్దూ వినోదం, హాస్య సాహిత్యంపై చేసిన ప్రసంగం విద్యావేత్తలు, పీహెచ్‌డీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రొఫెసర్ అక్బర్ హైదర్, ప్రఖ్యాత కవయిత్రి ఇశ్రాత ఆప్రిన్, ఇతర పండితులు హైదరాబాద్‌లో ఉర్దూ భాష స్థితిగతులపై ప్రసంగించారు. టెక్సాస్ యూనివర్సిటీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న గుల్–ఏ–రాణాను తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ డీన్ లావణ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, ఉర్దూ విభాగం అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.