అనుమతులు లేవు.. పర్యవేక్షణ లేదు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మట్టి మాఫీయ మట్టి దందాను జోరుగా సాగిస్తోంది. బాల్కొండ మండలం జలాల్‌పూర్, నాగాపూర్ శివారులో బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలను అడ్డగోలుగా చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ అధికారులు తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇటుక బట్టీలకు తరలింపు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం చుట్టూరుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు వెలిశాయి. ఆ ఇటుక బట్టీల కోసం ఎస్సారెస్పీ నుంచి మట్టి తవ్వకాలను చేపట్టి మట్టిని తరలిస్తున్నారు. అనుమతులు లేవు అనుకుంటూనే అధికారులు ఓ రకమైన అనుమతులు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అధికారుల అనుమతితో చలాన్ రూపంలో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ. 133 జమ చేసి అధికారుల పర్యవేక్షణలో మట్టి తవ్వకాలను చేపట్టాలి. కాని ఇక్కడ అవేమీ లేకుండానే మట్టి దందాను సాగిస్తున్నారు.
పెద్ద హై డ్రామా..
ఇటీవల ‘సాక్షి’ మట్టి తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం వద్ద నుంచి ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణికి ఫోన్‌లో సమాచారం అందించి, వివరణ కోరింది. వెంటనే స్పందించిన అధికారి కిందిస్థాయి అధికారులను తవ్వకాలు చేపడుతున్న ప్రాంతానికి పంపించారు. కానీ సదరు కిందిస్థాయి అధికారి వచ్చేలోపే యంత్రాలు, ట్రాక్టర్లు అక్కడి నుంచి పరారీ అయ్యాయి. అంటే సమాచార మిచ్చింది సంబధిత అధికారులే కావడంతో అక్కడ ఎలాంటి యంత్రాలు లభింలేదు. దీంతో ఎవరు లేరు అంటూ ఉన్నతాధికారులకు, కింది స్థాయి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇదంత అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని చెప్పవచ్చు. రైతులకు భూసారం పెంచుకోవడం కోసం మట్టి తవ్వకాలు చేపడితే కోటీ కొర్రీలు పెట్టే అధికారులు ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తే మిన్నకుండటం వెనుక మతలబు ఏమిటో అధికారులే చెప్పాలి. మట్టి మాఫియాతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు జేబులు నింపుకుంటున్నా అధికారులపై కూడ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో జోరుగా మట్టి తవ్వకాలు
సమీపంలోని ఇటుక బట్టీలకు
తరలింపు
పట్టించుకోని అధికారులు
అనుమతులు ఇవ్వలేదు..
ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం నుంచి ఎవరికి మట్టి తవ్వకాల కోసం అనుమతులు ఇవ్వలేదు. ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా మట్టి, మొరం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ
అనుమతులు లేవు.. పర్యవేక్షణ లేదు


