
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
డిచ్‌పల్లి: మండలంలోని డిచ్‌పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు (34) మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై సుహాసిని తెలిపారు. కొద్దిరోజులుగా ధర్మరాజు అప్పులతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన పెద్ద కూతురు అనారోగ్యం బారినపడింది. దీంతో మనస్తాపానికి గురైన ధర్మరాజు ఉదయం తన పొలంలోని చెట్టు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఎర్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై సుహాసిని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్, హజ్గుల్ సమీపంలో మంజీర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఉదయం 6 గంటలకు పట్టుకున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానా విధిస్తామన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ
వర్ని: మోస్రా మండలం గోవూర్ శివారులో మూడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కాయిల్స్, ఆయిల్‌ను దుండగులు చోరీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు స్థానిక రైతులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు.

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య