
కాంగ్రెస్‌లో ఉత్కంఠ
● ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సీఎం,
పీసీసీ అధ్యక్షుడి వరుస భేటీల నేపథ్యంలో..
● పీసీసీ కార్యవర్గంలో ఎవరెవరికి ఏఏ
పదవులో..లెక్కలేసుకుంటున్న శ్రేణులు
● స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం..
నాయకుల్లో డైలమా
● కేబినెట్ బెర్త్‌పైనా ఆసక్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీలో కాంగ్రెస్ అధి నాయకత్వంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ల వరుస భేటీల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా ప్రకటించవచ్చనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జిల్లా నుంచి పీసీసీ కార్యవర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారనే విషయమై పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ జిల్లా నుంచే ఉండడంతో పీసీసీ కార్యవర్గం కూర్పు విషయమై ఆసక్తి నెలకొంది. ముఖ్యమైన నాయకులు పీసీసీ పదవుల కంటే జిల్లా అధ్యక్ష పీఠంపైనే గురి పెట్టారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీ పదవుల కన్నా నామినేటెడ్ పదవులు తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల పందేరంపై అన్నివర్గాల్లో చర్చించుకుంటున్నారు.
● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ మాత్రం సంస్థాగత పటిష్టతపై కచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల కంటే పార్టీ పదవులు నిర్వహించేవారికే ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి నటరాజన్ ప్రకటించడం గమనార్హం. పైగా డీసీసీ అధ్యక్షులకు మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పడంతో ఈ పీఠం కోసం పోటీ పెరుగుతోంది. జిల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల పదవులు దక్కాయి. మరికొందరు సీనియర్ నాయకులు సైతం రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు జిల్లా ప్రజాపరిషత్, నగర మేయర్ పీఠాల రిజర్వేషన్లు ఎలా వస్తాయో అంశంపై లెక్కలేసుకుంటున్న తరుణంలో పార్టీ పదవుల పందేరం రావడంతో ఎటువైపు వెళ్లాలో కూడా కొందరు సీనియర్ నాయకులు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కీలకమైన డీసీసీ పీఠం రేసులోనూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానాల మోహన్‌రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. అయితే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న బాడ్సి శేఖర్‌గౌడ్ డీసీసీ రేసులోనూ ఉన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకుడు మార చంద్రమోహన్, ము ఖ్యమంత్రి అనుచరుడు బాస వేణుగోపాల్‌యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగేశ్‌రెడ్డి సైతం డీసీసీ రేసులో ముందున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి సైతం డీసీసీ పీఠం ఆశిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో డీసీసీ పీఠాన్ని బీసీలకిస్తారా, ఓసీలకిస్తారా అంశంపై ఆసక్తి నెలకొంది. మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ ఖైసర్‌కు సైతం పార్టీలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల కరసత్తు జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన మంత్రివర్గ విస్తరణపై సైతం పార్టీ నాయకత్వం చర్చిస్తోంది. ఈ క్రమంలో జిల్లా నుంచి మంత్రివర్గంలోకి కచ్చితంగా వెళ్లే అవకాశమున్న బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దు టూరి సుదర్శన్‌రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారనే విషయమై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.