రుద్రూర్: వరి కోతల అనంతరం మిగిలిన అవశేషాలను (కొయ్యలను) కాల్చొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల కాలుష్యం పెరగడంతో పాటు విలువైన సూక్ష్మరాశి నశిస్తుందని, కార్బన్ మోనాకై ్సడ్, మీథేన్ వంటి హానికర వాయువులు కొన్ని మిలియన్ టన్నులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుందని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రమ్మ రాథోడ్ అన్నారు. ఈమేరకు రైతులకు ఒక ప్రకటనలో పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు పంట అవశేషాలను కాల్చివేయకుండా సరైన విధానంలో కుళ్ల బెట్టుకోవడం వల్ల పంటకి పోషకాలు అందించడంతోపాటు ప్రకృతిలో విడుదలయ్యే విషవాయువులను తగ్గించవచ్చు.
ఇలా ఉపయోగించాలి..
మిషిన్‌తో వరి కోతలు కోయడం వల్ల సుమారుగా ఒకటిన్నర నుంచి రెండు టన్నుల గడ్డి ఎకరానికి పొలంలోనే ఉండిపోతుంది. దాన్ని త్వరగా కుళ్ల పెట్టే విధానాన్ని అవలంభిస్తే అది బాగా కుళ్లుతుంది. కానీ దాన్ని తగలపెట్టేసి తర్వాత దాన్ని దమ్ము చేస్తున్నారు. సుమారుగా ఒక ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు టన్నుల గడ్డిని తగల పెట్టడం వల్ల పంటకి అనేక పోషకాలు అందకుండా పోవటంతో పాటు పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలుగుతుంది. కోతల అనంతరం వరిగడ్డిని పశువుల మేతగా వాడుకోవాలి. లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించాలి.
కలియదున్నడంతో లాభాలు..
పొలంలో కొద్దిమేర ఉన్న ఎరువులు (నత్రజని, భాస్వరం , పొటాష్), సూక్ష్మ పోషకాలు భూమిలో కలియ దున్నిన తర్వాత దాదాపు 30 నుంచి 90 రోజుల మధ్య దాంట్లో ఉన్న పోషకాలు అందుతాయి. దీంతో తదుపరి పంటలకు వేయాల్సిన పోషకాలను 25 నుంచి 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఎరువుల మీద సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. పొలంలో తగలపెట్టకుండా మూడు నుంచి ఐదేళ్లు ఏకధాటిగా దమ్ము చేయటం వల్ల సేంద్రియ కార్బన శాతం కూడా గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇలా చేస్తే సాగు ఖర్చు తగ్గడంతో పాటు భూసార పరిరక్షణ జరుగుతుంది.
దమ్ము చేసే విధానం..
పొలంలో నీళ్లు పెట్టి దాన్ని కేజ్ వీల్స్ లేదా రోటవేటర్‌తో ఒకసారి దమ్ము చేసిన తర్వాత ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్పేట్‌తోపాటు 10 నుంచి 15 కిలోల యూరియా కలిపి వేయాలి. మళ్లీ మూడు నాలుగు రోజుల తర్వాత దమ్ము చేసి వారం వ్యవధిలో ఆఖరి దమ్ము చేసినట్లయితే పంటకి మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతాయి. అలాగే గడ్డి వేగంగా కుళ్లిపోతుంది. ఇలా కాకుండా మార్కెట్లో వరిగడ్డి కుళ్లడానికి వివిధ డీకంపోజర్లు అందుబాటులో వచ్చాయి. ఈ డీకంపోజర్ ఉపయోగించడం వల్ల బాగా సులువుగా వరిగడ్డి కుళ్లిపోయి త్వరగా పొలానికి పోషకాలు అందించవచ్చు.
డీకంపోజర్ ఉపయోగించే విధానం..
పూసా డీకంపోజర్: ఐదు లీటర్ల నీటిలో 250 గ్రాముల బెల్లాన్ని బాగా మరిగించాలి. ఈ ద్రావణం చల్లార్చిన తర్వాత 50 గ్రాముల శెనగపిండి, రెండు పూస డీకంపోజర్ బిళ్లలు కలిపేసి ఈ ద్రావణాన్ని నాలుగు నుంచి ఐదు రోజులు ని ల్వ ఉంచాలి. దీంతో అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తయారైన 5 లీటర్ల పూసా డీకంపోజర్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలపాలి.ఈ ద్రావణాన్ని పొలంలో సమానంగా పిచికారి చేస్తే గడ్డి బాగా కుళ్లిపోయి అందులో ఉన్న పోషకాలుభూమికి లభ్యమవుతాయి.
ఘాజియాబాద్ డీకంపోజర్: 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో రెండు కిలోల పౌడర్ చేసిన బెల్లాన్ని వేసి కర్రతో బాగా కలుపుకోవాలి. అందులో ఒక ప్యాకెట్ ఘాజియాబాద్ డీకంపోజర్ వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో సమానంగా పిచికారి చేస్తే 10 నుంచి 15 రోజుల్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగి గడ్డి బాగా కుళ్ళిపోతుంది. రైతులు పంట అవశేషాలనును కాల్చివేయకుండా సరైన విధానంలో కుళ్ల బెట్టుకోవడం వలన పంటకి పోషకాలు అందించడంతో పాటుగా ప్రకృతిలో విడుదలయ్యే విషవాయువులను తగ్గించవచ్చునని ఆమె వివరించారు.
పంటపొలాల్లో నిప్పు పెట్టడంతో
దెబ్బతింటున్న భూసారం
పంట దిగుబడిపై ప్రభావం
పొలాన్ని కలియ దున్నితేనే మేలు
రమ్య రాథోడ్, రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త
వరి కొయ్యలను కాల్చొద్దు