
కంబోడియాలో దేవునిపల్లి యువకుడి మృతి
కామారెడ్డి అర్బన్: కంబోడియా రాజధాని నాంఫెన్‌లో కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్‌కుమార్ (36) ఈ నెల 14న గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం కంబోడియా వెళ్లిన కిరణ్‌కుమార్ నాంఫెన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం భారతీయ రాయబార కార్యాలయం ద్వారా పోలీసులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించలేదని తెలుస్తుంది. దేవునిపల్లిలోని కిరణ్‌కుమార్ ఇంటికి పోలీసులు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకోకుండా స్టేషన్‌కు వచ్చి కలవాలని ఫోన్ చేయడంతో సరైనపత్రాలు లేక భయపడిన కుటుంబసభ్యులు మధ్యవర్తుల ద్వారా రెండుమూడు రోజులకు కలిశారు. కాగా, తెలిసిన బంధువుల ద్వారా కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కౌన్సిలేట్ అబ్రహంతో మాట్లాడగా ఆయన కిరణ్‌కుమార్ మృతదేహం తరలింపునకు కావాల్సిన పత్రాల ఫార్మేట్ పంపినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు పత్రాలు పంపిన తర్వాత శవం ఇంటికి చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు కొడుకులున్నారు.
14న గుండెపోటుతో మరణం
కుటుంబ సభ్యులకు ఆలస్యంగా
సమాచారం