
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు బంగారు పతకం
నిజామాబాద్ నాగారం: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని టీజీఆర్‌ఎస్ మైదానంలో ఈనెల 21 వరకు జరిగిన 11వ రాష్ట్ర జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజేతగా నిలిచి బంగారు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జిల్లా జట్టుపై తలపడి 06–01 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ కె శోభన్ బాబు, తెలంగాణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు డి అభిషేక్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు నారాయణ గుప్తా జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. విజేతగా నిలిచిన జిల్లా జట్టును జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఉత్తమ పిక్చర్ చందు (బోధన్) ప్రత్యేక బహుమతి అందుకున్నాడు. జట్టుకు కోచ్ మేనేజర్లుగా ఈ నరేశ్, వినయ్, తిరుపతి వ్యవహరించారు.