ఎకో టూరిజంతో ముంపు గ్రామాల అభివృద్ధి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఎకో టూరిజం ఏర్పాటైతే ముంపు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అటవీ శాఖ అధికారులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు అన్నారు. వాచ్ టవర్లు, రిసార్ట్‌ల కోసం స్థల సేకరణ నేపథ్యంలో శనివారం డొంకేశ్వర్ మండలంలోని చిన్నయానం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. చిన్నయానం, జీజీ నడ్కుడ, గాదేపల్లి గ్రామస్తులు సహకరిస్తే ఎకో టూరిజం ఏర్పాటు త్వరగా జరుగుతుందన్నారు. వాచ్ టవర్ల కోసం ఎకరం వరకు స్థలాన్ని ఇవ్వాలని కోరారు. టూరిజంతో స్థానికంగా ఉపాధి లభిస్తుందని, ఉద్యోగ అవకాశాల్లో గ్రామస్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. భూముల ధరలు కూడా పెరుగుతాయని, అన్ని విధాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
త్వరలోనే చిన్నయానంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరిస్తామని, ఏమైనా సమస్యలుంటే గ్రామస్తులు తెలియజేయాలని సూచించారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్వో, బీట్ ఆఫీసర్ సుశీల్, గాదేపల్లి మాజీ సర్పంచ్ నక్కల భూమేశ్, మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి పాల్గొన్నారు.


