
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: కామారెడ్డిలో 29 ఏళ్లుగా గంప గోవర్ధన్, షబ్బీర్ అలీల మధ్య ఎన్నికలు ఉద్ధండుల మధ్య సమరంలా జరిగేవి. ఇద్దరికీ బలమైన కేడర్ ఉండేది. ఇద్దరూ ప్రధాన పార్టీల అభ్యర్థులే కావడంతో ప్రతిసారి ఎన్నికలు పోటాపోటీగా జరిగేవి. అలాంటిది ఈసారి ఎన్నికల బరిలో ఇద్దరూ లేరు. దీంతో కామారెడ్డి ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.
1994 నుంచి..
నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ నాలుగుసార్లు గెలిచి రికార్డును సొంతం చేసుకున్నారు. మాచారెడ్డి మండలానికి చెందిన షబ్బీర్‌అలీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1989, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌అలీ రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గంప గోవర్ధన్ సింగిల్‌విండో చైర్మన్‌గా టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో టీ డీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు.
ఆ ఎన్నికల్లో మొద టిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీపై గెలుపొందా రు. 1999లో టీడీపీ నుంచి యూసుఫ్‌అలీకి టికెట్ ఇవ్వడ, 2004లో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా గంపకు టికెట్ దక్కలేదు. 2009లో రెండోసారి, 2014లో మూ డోసారి గంప, షబ్బీర్‌ల మధ్య పోటీ కొనసాగింది. మూడుసార్లు విజయం గంపగోవర్ధన్‌నే వరించినప్పటికీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లుగా 2014లో స్వల్ప మెజారిటీతో గంపగోవర్ధన్ గెలవడంతో వీరి మధ్య పోటీ ఏ స్థాయి లో ఉంటుందో తెలుస్తుంది.
పార్టీలు మారినా..
ఇంత కాలం పార్టీలు మారినా ప్రత్యర్థులు మారలేదు.. ఈ సారి కామారెడ్డి ఎన్నికల సీన్ పూర్తిగా మా రింది. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉంటూ ప్రతి సారి ఎన్నికల్లో సై అంటే సై అన్నట్లు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన ఇద్దరు ఈ సారి ఎన్నికల బరిలో లేరు. ప్రధాన పార్టీల ప్రత్యర్థులుగా షబ్బీర్‌అలీ, గంపగోవర్ధన్ ప్రతి సారి నువ్వా, నేనా అన్నట్లుగానే పోటీపడేవారు.
గెలుపోటములను పక్కనబెడితే మొన్నటి వరకు కామారెడ్డి రాజకీయాలు ప్రతిసారి ఓ కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు కేసీఆర్, రేవంత్‌రెడ్డిల రాకతో నియోజకవర్గంలో ఈసారి కూడా ఉద్ధండుల సమరానికి వేదిక కానుంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు విస్తృత పర్యటన చేపడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారిందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇద్దరికీ బలమైన కేడర్..
మొదట కాంగ్రెస్‌కు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోట గా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో మొన్నటివరకు ప్రధాన పార్టీల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌అలీలు ఇద్దరికీ బలమైన కేడర్ ఉంది. ఇద్దరికీ గ్రామ, మండల స్థాయిలో వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
రెండుసార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ తాను అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను అక్కున చేర్చుకుని అండగా నిలిచారు. అలాగే గంపగోవర్ధన్ అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకుల, కార్యకర్తల అభ్యున్నతికి చేయందించారు. అందుకే ఇప్పటికీ వారితో కలిసి పనిచేయడానికి ఆయా పార్టీల్లోకి చేరికలు జోరుగా సాగేవి.
పోటీతత్వమూ ఎక్కువే..!
కార్యకర్తలే పార్టీలకు బలం. బలమైన కేడర్‌ను సంపాదించుకున్న చిరకాల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌ల మధ్య పోటీతత్వమూ ఎక్కువే. ఎమ్మెల్యేగా ఉండి అవినీతికి పాల్పడుతూ అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నావంటూ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు తారా స్థాయికి చేరేవి. ఏకంగా వారిద్దరూ తమ ఆస్తులు వెల్లడించేందుకు కామారెడ్డి గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్ద గతంలో పంచాయితీ పెటుకునే వరకు వెళ్లారు.
మారిన రాజకీయ ముఖచిత్రం..
ఇద్దరూ పాత ఉద్ధండుల మధ్య జరిగే పోరులో కొనసాగింపునకు ఈ సారి బ్రేకులు పడ్డాయి. సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపింది. తానేం తక్కువ కాదంటూ బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి పోటీలో ఉన్నారు.
ఇప్పటి వరకు కామరెడ్డిలో అసెంబ్లీ ఎన్నికలు అనగానే అందరి దృష్టి గంప, షబ్బీర్‌ల పైనే ఉండేది. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి కామారెడ్డి బరిలోకి రాగా షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా వెళ్లారు. గంప స్థానంలో సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం బయటకు వచ్చిన నాటి నుంచి ఇక్కడి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ మరింతగా పెరిగింది. ప్రభుత్వవిప్‌గా ఉన్న గంప గోవర్ధనే కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ముందుండి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు కాంగ్రెస్ వర్గాల్లోనూ రేవంత్‌రెడ్డి రాకతో జోష్‌ను నింపుతోంది. బీజేపీ వర్గాలు సైతం విజయంపై ధీమాగా ఉన్నాయి. దీంతో కామారెడ్డి ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో వేచి చూడాలి.
ఇవి చదవండి: పోలింగ్‌కు కౌంట్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో.. ఎటు చూసినా ఎదురుగాలే..