కేంద్రాల్లో కుప్పలు.. రైతుల తిప్పలు.. | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల్లో కుప్పలు.. రైతుల తిప్పలు..

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● హమాలీ లేక.. లారీ రాక.. ● గన్నీ సంచులూ కొరతే.. ● రోజుల తరబడి కేంద్రాల్లోనే దిగుబడులు ● కుప్పలపైనే కాపలా కాస్తున్న అన్నదాత ● అదనపు పైసలిస్తేనే.. కదులుతున్న సంచులు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముడుపోయేదాకా అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. అమ్మకానికి తీసుకువచ్చిన పంటకు అకాలవర్షం శాపంగా మారుతోంది. చేతికొచ్చిన తర్వాత ఒక్కోసారి నోటికి రాకుండా చేస్తోంది. ఈసారి పంటంతా బాగుందని, దిగుబడి బాగా వచ్చిందని సంబరపడితే.. ఇప్పుడు కొనుగోలు కాలం పరీక్ష పెడుతోంది. రోజుల తరబడి కేంద్రాల్లో కుప్పల మీదనే కునుకు తీయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఎటుచూసినా ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయి. కానీ.. కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయి. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న, జొన్న తదితర పంట కొనుగోళ్ల పరిస్థితిపై సోమవారం పలు గ్రామాల్లో ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రధానంగా కేంద్రాల నుంచి మిల్లులు, గోదాములకు వెళ్లిన లారీలు రావడానికి చాలారోజులు పడుతోంది. అక్కడ హమాలీల కొరతతో అన్‌లోడింగ్‌ ఆలస్యమవుతోంది. లారీలు రాక కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంటకు మంచి ధర ఉండటంతో చాలా గ్రామాల్లో మక్కరైతులు సంచికి అదనంగా రూ.30 ఇచ్చి లారీలను మాట్లాడుకోవడం కనిపించింది. ఇక ఈ ఏడాదీ గన్నీసంచుల కొరత వేధిస్తోంది. ఓవైపు కాలం దూసుకువస్తున్నా.. కుప్పలుగా ధాన్యం అలాగే ఉండడం అన్నదాతను కలవరపెడుతోంది. నిర్మల్‌

ఆగిన వరి, మక్కల తరలింపు..

ముధోల్‌: మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 224 మంది రైతుల వద్ద 11,248 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 53 లారీల ధాన్యం మాత్రమే తరలించారు. హమాలీల కొరత, లారీలు రాక రైతులు ఎదురు చూడక తప్పడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement