విపత్తులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

విపత్తులపై అప్రమత్తం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● నిర్మల్‌లో మాక్‌ ఎక్సర్సైజ్‌ ● పర్యవేక్షించిన కలెక్టర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రకృతి విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో విపత్తు నిర్వహణ మాక్‌ ఎక్సర్సైజ్‌ నిర్వహించారు. కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మాక్‌ ఎక్సర్సైజ్‌లో భాగంగా వరదలు ముంచెత్తినట్లుగా కృత్రిమ పరిస్థితులు సృష్టించి రక్షణ చర్యలను ప్రదర్శించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులకు ప్రథమ చికిత్స అందించడం, అనంతరం ఆస్పత్రులకు తరలించడం వంటి చర్యలను అధికారులు ప్రత్యక్షంగా నిర్వహించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో భోజన, వసతి సదుపాయాల కల్పన ప్రక్రియను కూడా ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదల వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. ఇలాంటి మాక్‌ డ్రిల్స్‌ ద్వారా అధికారులు, సిబ్బంది అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో కూడా విపత్తులపై అవగాహన, అప్రమత్తత పెరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement