భైంసాటౌన్: మొక్కజొన్న పండించిన రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. పంట పండించడంతోపాటు అమ్మకానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు అధికారులు గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గన్నీలు లేక కొందరు రైతులు మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.35 వరకు పెట్టి సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. గన్నీలకు చిరుగులు ఉండడంతో కొనుగోలు కేంద్రం నుంచి లారీల్లో గోదాములకు తరలించడం, అక్కడ అన్‌లోడ్ చేసే సమయంలో మక్కలు వృథాగా పోతున్నాయి. మళ్లీ ఆ మక్కలను సంచుల్లో నింపేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. భైంసా పట్టణంలోని నిర్మల్ మార్గంలో ఉన్న గోదాముల వద్ద వందల సంఖ్యలో మక్కలోడ్ లారీలు 2 నుంచి 3 రోజుల తరబడి వేచి ఉంటున్నాయి. హమాలీల కొరత కారణంగా అన్‌లోడ్ కావడం లేదు.


