శ్రీరాంపూర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సిట్ వేసి విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కంపెనీలో రోజుకో స్కామ్ జరుగుతుందన్నారు. విజిలెన్స్ అధికారులు చిన్న చిన్న కేసుల్లో కార్మికులను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పెద్ద అవినీతి వ్యవహారాలను వదిలివేస్తున్నారని ఆరోపించారు. జైపూర్ ఎస్టీపీపీలోని మూడో విద్యుత్ యూనిట్ నిర్మాణ టెండర్‌లో అంచనాలను పెంచి కోట్ల రూపాయల అవినీతికి ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1150 కోట్ల ఎిస్టీమేషన్ తిరస్కరణకు గురి కాగా కాంగ్రెస్ సర్కార్ మరో రూ. 500 కోట్లు పెంచి రూ.1650 కోట్లకు కోట్ చేయడం అవినీతి వ్యవహారమన్నారు. బీఆర్‌ఎస్ ఒత్తిడితోనే శ్రీరాంపూర్ ఓసీపీలో 12 శాతం లెస్ టెండర్లు పడ్డాయని తెలిపారు. సీఎం కుటుంబ సభ్యులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో ఓసీల ఓబీ పనులను అప్పగించి అవినీతికి పాల్పడ్డన్నారు. కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో.. పేరుతో కార్మిక వర్గం కదిలి వచ్చి పోరాటాలు చేసి సంస్థను పరిరక్షించుకోవాలన్నారు. ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, అన్వేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


