నిర్మల్: ‘కోదండ రామయ్యకు, సుగుణాల సీతమ్మకు కల్యాణమంట రారండోయ్.. ఆ శ్రీసీతారాముల కల్యాణం కనులారా చూసొద్దాం..’ అంటూ జిల్లావాసులు రాములోరి గుడి కి వెళ్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా రామాలయాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చే శారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, రాములోరి పెళ్లి ని కనులారా వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు.
అడుగడుగునా రాముడు..
వనవాస సమయంలో జిల్లా మీదుగా రామయ్య వెళ్లినట్లు చెబుతుంటారు. ఆ సమయంలోనే జిల్లాకేంద్రంలోని గండిరామన్న గుహలో లింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు చేసినట్లు చెబుతారు. అయోధ్యరాముడికి జిల్లాలో అడుగడుగునా గుడి అన్నట్లుగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని వాల్మీకినగర్ రామాలయం, బ్రహ్మపురిలో రాంమందిర్, శాంతినగర్ రామాలయాలతోపాటు ప్రధానంగా భైంసా మండలం కామోల్ రామాలయంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా మండలాల్లో రామాలయాలు ఉన్నాయి.
వాల్మీకినగర్‌లో..
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని వాల్మీకినగర్ శ్రీరామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్యాణానికి ముందుగా పందిరి వేయడం మొదలు ప్రతీ కార్యక్రమాన్ని సంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. సీతారాముల కల్యాణ క్రతువులో భాగంగా గురువారం రాములోరిని పెళ్లికొడుకుగా, సీతమ్మను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను, మంగళసూత్రం, జీలకర్ర బెల్లం తయారు చేశారు. శుక్రవారం నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.
నేడు శోభాయాత్ర..
హైదరాబాద్ తర్వాత జిల్లాలోనే శ్రీరామనవమి శోభాయాత్ర భారీగా జరుగుతుంది. ఏటా నవమి, అలాగే హనుమాన్ జయంతికి వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించేవారు. ఈసారి విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ శ్రీరామ వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో స్థానిక దేవరకోట దేవస్థానం నుంచి ఉదయం 10 గంటలకు ఈయాత్రను ప్రారంభించనున్నారు. అలాగే భైంసాలోనూ శ్రీరామనవమి ర్యాలీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిసేలా ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది.


