స్వతంత్రుల ‘మ్యాజిక్‌’? | - | Sakshi
Sakshi News home page

స్వతంత్రుల ‘మ్యాజిక్‌’?

Feb 14 2026 9:48 AM | Updated on Feb 14 2026 9:48 AM

స్వతంత్రుల ‘మ్యాజిక్‌’?

స్వతంత్రుల ‘మ్యాజిక్‌’?

వాతావరణం ● ప్రకటించిన డీసీసీ అధ్యక్షుడు బొజ్జు ● కాంగ్రెస్‌ విజయంపై పార్టీ శ్రేణుల హర్షం

వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయి. పగలు వేడిగా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత చల్లగా ఉంటుంది.

భైంసాటౌన్‌: భైంసా పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. శుక్రవారం వెలువడిన మున్సి పల్‌ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఎంఐఎంకు కంచుకోట గా ఉన్న భైంసాలో ఈసారి 12 స్థానాల్లో మా త్రమే విజయం సాధించింది. 12 వార్డుల్లో బరిలో నిలిచిన బీజేపీ నుంచి ఆరు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ 25 వార్డుల్లో పోటీ చేసి ఒక స్థానంతో సరిపెట్టుకుంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవలేదు. స్వతంత్రులు సత్తా చాటా రు. దీంతో మ్యాజిక్‌ వారే చేయనున్నారు.

స్వతంత్రుల సత్తా..

ఈసారి మున్సిపల్‌ ఎన్నికల ఘట్టంలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటి, చైర్మన్‌ పీఠం కై వసం చేసుకోవడంలో కీలకంగా మారారు. బీజేపీకి చెందిన పలువురికి టిక్కెట్లు దక్కకపోవడంతో వారు రెబల్‌గా బరిలో నిలిచారు. 7వ వార్డు నుంచి జవారే రాహుల్‌కు టిక్కెట్‌ రాకపోవడంతో తల్లి రమాబాయిని పోటీలో నిలిచి గెలిచారు. 9వ వార్డు నుంచి తాలోడ్‌ శ్రీనివాస్‌ భార్య రాధిక, 11వ వార్డులో వడ్నం శ్రీనివాస్‌, 23వ వార్డులో తూమొల్ల దత్తాత్రి స్వతంత్రులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక 12వ వార్డులో ధర్మపురి శ్రీనివాస్‌ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 24వ వార్డులో ఇద్రిజ్‌ బేగ్‌ మద్దతుదారు ఫర్జానా బేగం, 25వ వార్డులో బీబీ కుతిజా సిద్ధిఖా స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. 26వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఫిర్దోస్‌ బేగం గెలుపొందారు.

పుర పీఠంపై కావ్య

నిర్మల్‌: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పార్టీ తొలి చైర్‌పర్సన్‌ స్థానాన్ని ప్రకటించింది. నిర్మల్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్యను డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్‌ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జు పటేల్‌, శ్రీహరిరావు, అర్జుమంద్‌అలీ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీ చేసిన మతతత్వ రాజకీయాలకు నిర్మల్‌ ప్రజలు చెంపపెట్టులాంటి ఫలితం ఇచ్చారని తెలిపారు. తామంతా ధర్మాన్ని పాటిస్తామని, అలాగే అభివృద్ధి కోసం శ్రమిస్తామని చెప్పారు. బీజేపీ మాత్రం సమాజాన్ని విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. జిల్లాలో మొత్తం 80 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ 28 చోట్ల గెలిచిందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వ సహకారంతో నిర్మల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

సమష్టి విజయం..

నిర్మల్‌ ప్రజలు అభివృద్ధికి, అనుభవానికి ఓటేశారని, ఇది కాంగ్రెస్‌ పార్టీ సమష్టి విజయమని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, 37వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన అప్పాల గణేశ్‌చక్రవర్తి అన్నారు. తన భార్య అప్పాల కావ్యను చైర్‌పర్సన్‌గా పార్టీ ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌అలీ, నాయకులు, కార్యకర్తల కృషితోనే నిర్మల్‌లో ఏకపక్షంగా 24 వార్డులు గెలిచామని పేర్కొన్నారు. నిర్మల్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.

కౌంటింగ్‌ సరళి ఇలా..

భైంసా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. మొత్తం 26 వార్డులు ఉండగా, తొలి రౌండ్‌లో 1,3,5,7,9,11,13,15,17, 19,21,23,25 వార్డుల ఓట్లు లెక్కించారు. ఏడోవార్డు స్వతంత్ర అభ్యర్థి జవారే రమాబాయి గెలుపుతో బోణీ కొట్టారు. ఆపై 9,11,23,25 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందగా, మిగిలిన అన్ని వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. రెండో రౌండ్‌లో 2,4,6,8,10,12, 14,16,18,20,22,24,26 వార్డుల ఓట్లు లెక్కించగా, ఈసారి బీజేపీ బోణీ ప్రారంభించి ఆరు వార్డుల్లో(4,6,8,10,14,22) విజయం సాధించింది. ఎంఐఎంకు కీలకమైన రెండో రౌండ్‌లో 2,16,18,20 వార్డుల్లో విజయం సాధించినా, 24లో స్వతంత్ర, 26 వార్డులో కాంగ్రెస్‌ గెలుపుతో ఎంఐఎం అధికార పీఠానికి అడ్డుపడినట్లయింది. 20వ వార్డులో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నిజాముద్దీన్‌కు 174 ఓట్లు పోలయ్యాయి. దీంతో కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు సముదాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement