ప్రలోభ పర్వం
నిర్మల్: తొలి విడత పంచాయతీ ఎన్నిల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. రాత్రి ప్రలోభపర్వం మొదలైంది. ఎన్నికలు పూర్తయ్యేదాకా.. ఏ ఒక్క ఓటునూ వదలకుండా పట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే లెక్కలు వేసుకున్నారు. ఎవరికి ఏమివ్వాలి, ఏ కులసంఘాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికకు ఒక్కరోజు ఈ తాయిలాలు సమర్పించుకుని, ఓట్లు తీసుకోవడమే తరువాయి అన్నట్లుగా గ్రామాల్లో అభ్యర్థులు సన్నద్ధమయ్యారు.
ఇంటికే అన్నీ..
కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. డబ్బు, మద్యంతోపాటు రెండుమూడు రోజులపాటు మాంసం అందించే ఏర్పాట్లు చేశారు. ఎన్నికకు ఒకరోజు నోట్లు పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్ని పంచాయతీల్లో తాగేవారికి, తినేవారికి మద్యం, మాంసం ఇంటికే పంపుతున్నారు.
సంఘాల వారీగా..
ఫలానా సంఘం వాళ్లకు ఫంక్షన్లు చేసుకోవడానికి వంటసామగ్రి లేదట.. అని తెలియగానే ‘నేనిస్తాగా..’ అంటూ అభ్యర్థులు కొనిచ్చేస్తున్నారు. మరో సంఘానికి ఇంకో తాయిలం. ఇలా.. వ్యక్తిగతంగా ఇవ్వడంతో పాటు కులసంఘాల వారీగానూ అభ్యర్థులు తాయిలాలు ఇస్తూ ఓట్లను రాబట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. కొన్నిగ్రామాల్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడంతోపాటు ఆ కులపెద్దల నుంచి తనకే ఓట్లు వేయాలని మాట తీసుకున్నారు.
ఆకట్టుకునేలా హామీలు..
‘గ్రామంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా.. రూ.ఐదువేలు ఇస్తా..’ అంటూ ఓ గ్రామంలో అభ్యర్థి ఫ్లెక్సీ పెట్టాడు. మరోచోట..‘ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గ్రామం కోసం కష్టపడతా..’అంటూ మరో అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ఆకట్టుకునే హామీలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. జోరుగా ప్రచారం చేసినా.. ఎంతమంచి పేరున్నా ఎంతోకొంత ఇస్తేగానీ తమకు ఓట్లు రావంటూ చాలామంది అభ్యర్థులు ఓట్లకోసం నోట్ల పంపకాన్నే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు.. ఈ రెండ్రోజులు మరోఎత్తు అంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రలోభపర్వంలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు.


