జిల్లాలో గోదావరి పరిక్రమన యాత్ర
బాసర/భైంసారూరల్/భైంసాటౌన్/నిర్మల్‌టౌన్/ఖానాపూర్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ గోదావరి నది జన్మస్థలం నుంచి 400 మంది సాధువులు ప్రారంభించిన గోదావరి పరిక్రమన (ప్రదక్షిణ) యాత్ర మంగళవారం జిల్లాకు చేరుకుంది. ముందుగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి వచ్చిన సాధువులకు ఆలయ వైదిక బృందం, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాసర సరస్వతి అమ్మవారికి, భైంసారూరల్ మండలం మాటేగాం గ్రామంలో కొరడి గణపతికి రాజేంద్రదాస్ మహారాజ్, భాగేశ్వర్‌థామ్ సర్కార్ మహారాజ్, సద్గురు శివ్‌లింగ్ మహారాజ్, కేదారేశ్వర పలుగుట్ట రాములు మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 400 మందిసాధువులు, మహాపీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు, ప్రకృతి అందాలను దర్శిస్తూ సంపూర్ణమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు రాజేంద్రదాస్ తెలిపారు. అనంతరం భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణ మీదుగా 50 వాహనాల్లో సాధువులు యాత్రగా వెళ్లారు. నిర్మల్ ఈద్గాం చౌరస్తా వద్ద పలు పాఠశాలాల విద్యార్థులు, ఆధ్యాత్మిక సంఘాలు , భక్తులు, వ్యాపారులు, కుల, ఉద్యోగ సంఘ నాయకులు స్వాగతం పలికారు. సాధువుల ఆశీర్వచనం పొందారు. బైక్ ర్యాలీతో శోభయాత్రగా కొండాపూర్ వరకు వెళ్లారు. కార్యక్రమాన్ని అరుణ్ శర్మ ముందుకు తీసుకెళ్లారు.
జిల్లాలో గోదావరి పరిక్రమన యాత్ర


