మనం గెలవాలె తమ్మీ..!
నిర్మల్‌చైన్‌గేట్: పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కింది. మొదటి విడత ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 14న రెండో విడత పోలింగ్, 17న మూడో విడత పోలింగ్ జరుగుతుంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడడం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఓడిపోవద్దని కొందరు ఏకంగా బాండ్ పేవర్లపై హామీలు రాసి ఇస్తున్నారు. కొందరు గ్రామానికి భూమి ఇస్తామని, మరికొందరు ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తామని, అంత్యక్రియలకు రూ.5 వేలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని బాండ్ రాస్తున్నారు.
ఒకరిని మించి ఒకరు..
ఎంత ఖర్చు అయినా సర్పంచ్‌గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చుకు వెనుకాడడం లేదు. గ్రామాల్లో నిర్మించే ఆలయాలకు పోటీపడి చందాలు ఇస్తున్నారు. యూత్ కోసం శివాజీ విగ్రహాల ఏర్పాటు, క్రీడాసామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు.


