అర్ధ శతాబ్దపు ఆకాంక్ష..
ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ ఇంకెప్పుడు..
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ అంశం మరోమారు ప్రస్తావనకు వచ్చింది. జిల్లావాసి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు సిర్గాపూర్ నిరంజన్‌రెడ్డి రాజ్యసభలో సోమవారం ప్రస్తావించారు. అర్ధ శతాబ్దాపు ఆకాంక్షను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్న తీరును ఎండగట్టారు. ‘హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ 300కి.మీ. దూరంలో ఉంది. కానీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు రైళ్లో వెళ్లాలంటే 435కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రజల సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయి. 50 ఏళ్ల నుంచి డిమాండ్‌గా ఉన్న నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్‌ను నిర్మిస్తే.. దూరభారం తగ్గడంతోపాటు ఈ ప్రాంతంలోని 7 లక్షల మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్‌కు నిధులు విడుదల చేసి, నిర్మాణం చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నా.. ప్రజల సమస్యను పట్టించుకోరా..!? అని ప్రశ్నించారు. రైల్వేలైన్ నిర్మాణంపై రాజ్యసభలో జిల్లావాసి నిరంజన్‌రెడ్డి లేవనెత్తడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైల్వేలైన్ నిర్మాణంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఈనెల 6న జిల్లాపై ‘ఎందుకీ వివక్ష’ శీర్షికన తాజా కథనాన్ని ప్రచురించింది. తాజాగా ఎంపీ ప్రస్తావనతో ఇప్పటికై నా జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలన్న వాదన పెరుగుతోంది.
సర్వేలు పూర్తయినా..
ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు వెంటనే రైల్వే లైన్‌ను నిర్మించాలని, దీనికి అవసరమైన నిధులను కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేయాలని రాజ్యసభలో నిరంజన్‌రెడ్డి కోరారు. 2010–11 సంవత్సరంలోనే ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు సంబంధించిన సర్వే పూర్తయింది. అయినా నిర్మాణం చేపట్టడం లేదు అని పేర్కొన్నారు. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ లేని కారణంగా ఆదిలాబాద్ ప్రజలు రైలులో హైదరాబాద్ వెళ్లాలంటే నాగపూర్ మీదుగా 435 కి.మీ. మేరకు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.
ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలి..
50 సంవత్సరాల నుంచి నిర్మల్ ప్రాంత ప్రజలు రైల్వేలైన్ కోసం డిమాండ్ చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతంలో దాదాపు 7లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఇప్పటివరకూ రైల్వేలైన్ సౌకర్యం లేదన్నారు. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే దేశంలోని రెండు ప్రధాన మహానగరాలైన హైదరాబాద్–నాగపూర్ మధ్య దూరభారం తగ్గుతుందని తెలిపారు. వ్యాపార,వాణిజ్య సంబంధాలు పెరుగుతాయని, ప్రజారవాణా మెరుగుపడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా రైల్వేలైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


