బాల్య వివాహాలను అరికట్టాలి
నిర్మల్‌టౌన్: బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీవో మురళి, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మిషన్‌శక్తి ఆధ్వర్యంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్లలకు చదువు వారి ఉజ్వల భవిష్యత్‌కు దోహదపడుతుందన్నారు. చిన్న పిల్లలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోనివ్వాలని సూచించారు. చిన్న వయసులో బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆడపిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజు, సీడబ్ల్యూసీ అనిల్, గురువంత్‌రావు, జోషి, ప్రవీణ్, డీసీపీవో మురళి, సీడీపీవో సరిత, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


