తెల్లబోతున్నారు..
భైంసాటౌన్: ఈ ఖరీఫ్ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. దిగుబడి చేతికి వచ్చే సమయంలో మోంథా తుపాను నిండా ముంచింది. దూది తడిసిపోయింది. కాయలు రాలిపోయాయి. తీవ్రంగా నష్టపోయిన రైతులు అరకొరగా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు కూడా అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసినా.. విక్రయానికి ఇక్కట్లు తప్పడం లేదు. తరచూ సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రబీ పంటలకు పెట్టుబడి లేక అవస్థ పడుతున్నారు. కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎల్–1, ఎల్–2 ఆంక్షల కారణంగా సీసీఐతోపాటు ప్రైవేట్‌లోనూ కొనుగోళ్లు నిలిపేస్తున్నట్లు మిల్లుల యజమానులు చెబుతున్నారు. జిల్లాలో సీసీఐ కొనుగోళ్లు ఈనెల 3 నుంచి ప్రారంభం కాగా, ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది రైతుల నుంచి 35 వేల క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది.
ఎల్–1, ఎల్–2 సమస్యతో..
జిల్లాలో 15 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎల్–1, ఎల్–2 ప్రాతిపదికన కొన్ని మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. సీసీఐ నిబంధనల ప్రకారం.. పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసే మిల్లుల్లోనే మొదటి, తర్వాతి ప్రాధాన్యత కింద పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో మిగిలిన మిల్లులకు పత్తి కొనుగోళ్లకు అవకాశం ఉండడం లేదని మిల్లుల యజమానులు పేర్కొంటున్నారు. సీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు జరపాలనే డిమాండ్‌తో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం బంద్ పాటించనున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకోని పక్షంలో నిరవధిక బంద్ పాటిస్తామని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులకు లేఖ అందజేశారు. దీంతో జిల్లాలో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగుతాయా.. లేదా అన్న సందిగ్ధం నెలకొంది. అసలే కపాస్ కిసాన్‌యాప్, తేమశాతం వంటి నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు తరచూ సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతుండడంతో మరింత అవస్థలు పడుతున్నారు.
భైంసాలో పత్తి విక్రయానికి వచ్చిన వాహనాలు(ఫైల్)
నిబంధనల మేరకు కేటాయింపు..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సీసీఐ నిబంధనల ప్రకారం ఎల్–1, ఎల్–2, ఎల్–3 ప్రాతిపదికన భైంసాలోని కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతున్నాం. గుర్తించిన అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలని అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనుగోళ్లు చేపడతాం. – వెంకటేశ్వర్లు, సీపీవో, భైంసా
అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు
జరపాలి..
ఎల్–1, ఎల్–2 నిబంధనలతో పత్తి జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టారు. సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరిపితే, అన్ని మిల్లు ల నిర్వాహకులకు ప్రయోజనం చేకూర దు. అందుకే రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నిరసన చేపడతాం.
– ఓం ప్రకాశ్‌లడ్డా,
భైంసా కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్స్
అసోసియేషన్ అధ్యక్షుడు


