ఇంటర్ చదువు.. సాఫ్ట్‌వేర్ కొలువు..!
కుంటాల: విద్యపై అభిరుచి ఉన్నవారికి అవకాశాలు తలుపు తడతాయని కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థినులు నిరూపించారు. సరైన మార్గదర్శకత్వం, నిబద్ధత, పట్టుదల ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా సత్తా చాటుతారని చాటారు. గ్రామీణ నేపథ్యం ఉండి.. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. సాఫ్ట్‌వేర్ కొలువులు సా ధించి గ్రామీణ విద్యా ఉద్యమానికి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి. ఇంతవరకు సాఫ్ట్‌వేర్ రంగం ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉందనే అభిప్రాయాన్ని ఈ విద్యార్థినులు తొలబించారు. ఇంటర్ చదువుకుంటూనే ఐటీ రంగంవైపు దూసుకెళ్లడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
హెచ్‌సీఎల్ టెక్‌బీ పరీక్షలో ప్రతిభ..
హైదరాబాద్ లేదా బెంగళూరులాంటి ప్రధాన నగరాలకే సాంకేతిక విద్యా అవకాశాలు పరిమితం కావని హెచ్‌సీఎల్ టెక్‌బీ సంస్థ నిరూపిస్తోంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐటీ రంగంలో ప్రవేశం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో కుంటాల ఆదర్శ పాఠశాల నుంచి 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నలుగురు విద్యార్థినులు గంటన్న మోక్షశ్రీ, మొల్లోల్ల స్పందన, ఆకుల రిషిత, సత్యపు మమత ప్రతిబ కనబర్చి ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
విద్య, ఉపాధి అవకాశాలు..
ఎంపికై న విద్యార్థినులకు ఆరు నెలల సమగ్ర సాంకేతిక శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.10 వేల స్టైఫండ్ ఇవ్వనున్నారు. అనంతరం డెవలపర్, డేటా ఇంజినీర్, ఎనలిస్టు వంటి విభాగాల్లో ప్రాథమిక హోదాల్లో నియమిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే, ఉద్యోగం చేస్తూనే వారు డిగ్రీ, బీఎస్సీ లేదా ఎంటెక్ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఐఐటీ గౌహతి, బిట్స్ పిలానీ, ఐఐఎం సీర్మౌర్, శాస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్ మోడ్‌లో విద్య కొనసాగించే అవకాశం లభిస్తుంది. చదువుకునే సమయంలో సంస్థ మొదటి సంవత్సరం నుంచి రూ.19 వేల స్టైఫండ్ చెల్లింపుతోపాటు, పూర్తి కోర్సు అనంతరం బీఎస్సీకు రూ.1.40 లక్షలు, ఎంటెక్ ప్రోగ్రాంకు రూ.2.40 లక్షల వరకు వేతన ప్యాకేజీని అందిస్తోంది. అవసరమైతే బ్యాంక్ రుణ సదుపాయాన్ని కూడా సమకూరుస్తున్నారు.
గ్రామీణ శక్తికి గుర్తింపు..
ఈ విజయాలు సాధారణంగా వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాక, ఒక సామాజిక మార్పు సూచనలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు మౌలిక సదుపాయాల కొరత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేమి వలన వెనుకబడిన గ్రామీణ విద్యార్థులు ఇప్పుడు నూతన టెక్నాలజీ లోకానికి అడుగుపెడుతున్నారు. వారి విజయాలు కొత్త తరాల విద్యార్థులకు స్పూర్తిగా మారుతున్నాయి.
సంతోషంగా ఉంది
సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తద్వారా స్కిల్స్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఇంటర్ పూర్తికాగానే శిక్షణ కోసం వెళ్తాను.
– గంటన్న మోక్షశ్రీ
ఇంజినీరింగ్ లేకుండానే..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఇంజినీరింగ్ చేయాలనుకనేవాళ్లం. హెచ్‌సీఎల్ టెక్‌బీ సంస్థ మాకు ఇంజినీరింగ్ లేకుండానే ఉద్యోగం ఇచ్చింది. చిన్న వయసులోనే మా కాళ్లపై మేము నిలబడే అవకాశం వచ్చింది. – మొల్లోల్ల స్పందన
మంచి అవకాశం
ఇంటర్ చదువుతో సాఫ్ట్‌వేర్ కొలువు రావడం విద్యార్థులకు మంచి అవకాశం. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం, కుటుంబానికి చేయూతనిచ్చినట్లు అవుతుంది.
– ఎత్రాజ్ రాజు, ప్రిన్సిపాల్
భవితకు పునాది
విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగంవైపు మొగ్గు చూపాలన్న లక్ష్యంతో తమ సంస్థ ముందుకు వచ్చింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి కొలువులు ఇస్తున్నాం. భవితకు మంచి పునాది వేస్తున్నాం.
– రాజుల రాజకుమార్, హెచ్‌సీఎల్‌టెక్‌బీ ఏరియా ప్రతినిధి
ఇంటర్ చదువు.. సాఫ్ట్‌వేర్ కొలువు..!
ఇంటర్ చదువు.. సాఫ్ట్‌వేర్ కొలువు..!
ఇంటర్ చదువు.. సాఫ్ట్‌వేర్ కొలువు..!
ఇంటర్ చదువు.. సాఫ్ట్‌వేర్ కొలువు..!


