బోర్లు.. బావులు.. చెరువులు..
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో చిన్న నీటివనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జలశక్తి అభియాన్’లో భాగంగా ఐదేళ్లకోసారి జిల్లాల వారీగా బావులు, బోర్లు, చెరువులు, కుంటలు, 2 వేల హెక్టార్లలోపు సాగునీరు అందించే మినీ ప్రాజెక్టుల గణన నిర్వహించనున్నారు. ఈ గణన ద్వారా ప్రతీ గ్రామంలో ఏయే రకాల నీటివనరులు ఉన్నాయో, వాటి ప్రస్తుత స్థితి ఎలా ఉందో స్పష్టమైన సమాచారం సేకరిస్తారు. వివరాలను ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం భవిష్యత్తులో రాష్ట్ర నీటివనరుల అభివృద్ధికి ఆర్థికసాయం అందిస్తుంది. నీటి వనరుల గణన త్వరలో ప్రారంభంకానుంది. అధికారులు క్షేత్రస్థాయిలో మాన్యువల్ పద్ధతిలో లెక్కింపు నిర్వహించి, దీనికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేయనున్నారు.
2017–18 లెక్కింపులో ఇలా..
ఐదేళ్లకు ఒకసారి ఈ గణన నిర్వహిస్తారు. 2017–18లో జరిగిన లెక్కింపులో జిల్లా వ్యాప్తంగా 474 ట్యాంకులు, 8,163 బోరు బావులు, 23,168 గొట్టబావులు, చెరువులు, వాగులు, చెక్‌డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి నీటివనరులను గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సారి గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు సీపీవో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సూచనల మేరకు ప్రతీ మండలస్థాయిలో సమగ్ర చర్యలు చేపడుతున్నారు.
సిబ్బందికి శిక్షణ..
నీటివనరుల లెక్కింపులో పాల్గొననున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సీపీవో కార్యాలయ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఈ సర్వే పర్యవేక్షణలో పాల్గొంటారు. ఇందుకోసం కలెక్టర్ చైర్మన్‌గా, సీపీవో కన్వీనర్‌గా వ్యవహరించే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు నీటివనరుల లెక్కింపు నిర్వహిస్తారు. మండలాల వారీగా సమన్వయ బాధ్యతలను తహసీల్దార్లు చేపడతారు. క్షేత్రస్థాయిలో నమోదు చేసిన వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసి, ఉన్నతాధికారులకు సమర్పిస్తారు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
చిన్న నీటివనరుల గణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సర్వే కోసం సిబ్బందిని ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాం. త్వరలో ఎన్యూమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వెంటనే గ్రామాల్లో సర్వే చేపడతాం. నెల రోజుల్లో నీటివనరుల గణన పూర్తిచేసి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
– జీవ రత్నం, సీపీవో


