రహదారులే కల్లాలు
లక్ష్మణచాంద:వ్యవసాయ జిల్లాగా పేరుగాంచిన నిర్మల్ జిల్లా ప్రస్తుతం వానాకాలం పంటల కోతలు మొదలయ్యాయి. మొక్కజొన్న, సోయాబీన్ కోతలు దాదాపు ముగింపు దశలో ఉండగా, మరో వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. పంటలు కోసిన రైతులు కల్లాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో స్థలం కొరత కారణంగా రోడ్లనే కల్లాలుగా మారుస్తున్నారు. గ్రామాల్లో రోడ్లపై పంటలు ఆరబెడుతున్నారు.జిల్లాలోని పలు మండలాల రైతులు ఖాళీ ప్రదేశాలు లభించక ఇలా చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
అవగాహన లోపంతో..
ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నాయి. అయితే రైతులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపైనే పంటలు ఆరబోస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు రాత్రిళ్లు ధాన్యంపై టార్పాలిన్ కవర్లు వేస్తున్నారు. ఆ కవర్లు కొట్టుకుపోకుండా పెద్ద బండరాళ్లు పెడుతున్నారు. వాహనదారులు చీకట్లో అవి కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం సమీపంలో బైక్ వెళ్తున్న ఓ కుటుంబ రోడుపై ఆరబెట్టిన మొక్కజొన్నపై జారిపడి ప్రమాదానికి గురైంది. రైతులకు అవగాహన లేకపోవడంతో ఇలా చేస్తున్నారు.
చర్యలకు ముందుకు రాని అధికారులు
రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు చిన్న పంట కలాలు, ఆరబెట్టే స్థలాలు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి అమలు కావడం లేదు. అధికారులు, పోలీసులు, సామాజిక సంస్థలు రైతులు పంటలు రోడ్లపై ఆరబెట్టకుండా అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.


